ఏ గుడ్డూ తెలియదు
ఏ గుట్టూ తెలియదు
ఈ థాత్రి మట్టి లోని మైత్రి తోబుట్టువునని తెలియదు
ఆ తరగతి గది గోడల పైనే విడిచారు నా పరివర్తన ప్రబంధం!
అందుకే నేడు మరల ఆ మరపులను తలుద్దాం!
ఆకుల అడుగున వెలసిన పదుల గుంపులలో ఒకటిని ,నేను గుడ్డును!
దశల వారీ దిశల మార్పే - నా జీవన విధానం!
గుడ్డు నుండి బయటకొచ్చే గొంగళిగా నా జన్మ విలాసం మీకుందా?
నాకు అనుమానామే!
తినటం, తినటం, నమలటమే ధ్యేయం
రాత్రీపగలు అలవోకగా ఆకులన్నీ ఆరగించేస్తా!
ఆ పై ఎన్నో రెట్లు ఎదిగేస్తా, పెరిగేస్తా,
విరిచేస్తా, వదిలేస్తా నా ఎముకల బాహ్యతను!
వారాలన్నీ తిరిగేలోగా నాలో జిహ్వ చాపలం తరగి,
తత్వచింతన పొందినట్టు చుట్టూ అల్లుకున్న వలయంలో,
నిశ్చేతనం లో ప్యూపాగా పదిలంగా ఉండిపోతా!
కదలకుండా ఉంటేనేం! కణాల మార్పులు కోకొల్లలు!
వారాల్లోనే వరాలన్నీ వరించినట్టు,
ఇంద్రథనస్సే వాకిట్లోకి విచ్చేసినట్టు,
నేనే మారిపోతా!
ముడుచుకున్న రెక్కల్లోకి నాభి నుండి ఉబికిన ద్రవాలను నింపి,
తొలిసారి ఆడించేందుకు నా రెక్కలను సమాయత్తం చేసుకుంటా!
ఆ పై గంటల వ్యవధి లో ఆరబెట్టిన రంగుల కోకలను,
వీస్తున్న గాలిలోకి విసిరినట్టు,
సీతాకోకచిలుక గా మారి నా తొలి ప్రకంపనల ప్రయాణం మొదలుపెడతా!
-శరత్చంద్ర