శీతాకాలం సలికి పిడకలు పాడెక్కాయి..
ఎండుటాకులు, పుల్లలు, కర్రలూ కాలి వేడిపుట్టించాయి..
ఆ చుట్టూ మందిమి చేరి వెచ్చదనం వడ్డించుకున్నాము..
మిగిలిన నిప్పుల మీద నీళ్ళు కాచుకున్నాము..
నలుగు తోముడికి దేహం లో మకిలి వెక్కెక్కి వీడ్కోలు పలికింది..
నేసిన అంబరాలు అమ్ముడుపోలేదు..
నేతకు నోచుకోని ప్యాంటు చొక్కాలు తోలుకు తొడుక్కున్నాము..
వండుకున్న గారెలు కొనుకున్న బూరెలతో పాటు..
పచ్చిపులుసూ పప్పన్నం అంగడి అరటి ఆకుల్లో అమరాయి..
ఆపై సేద తీరి సాయంత్రం చంటి పిల్లల నెత్తిన భోగి పళ్ళతో బొప్పెట్టినాము!
సంకురేతిరి తెల్లారకుండానే సంకులసమరం మొదలాయె..
సుట్టాలు సుట్టుముట్టే యేల సర్దుకోటాలు సేయలేదని రసాభాసా!
పోరు మొరలు ఆలకించి బూజులు దులిపాము..
ఆపై తయారయ్యి అయినోళ్ళ దర్జాలకి ఆహ్వానం పలికాము..
తీరుబాటుగా తిండి తిని ఎన్ని దినాలయ్యిందో అన్నట్టూ ..
అరిసెలు బొబ్బట్లు పులిహోర చక్రపొంగళ్ళ మీద పడబోతే..
కాకి పిండాలు తినేదాక తాకమాకన్నారు!
ఆగియాగి ఆకునాకి.. అరిగేదాక తిరగాలని ..
భుక్తాయాసంతోనే బయటకు కదిలాము..
సముద్రపు ఇసకలో పతంగులు ఎగిరేసి...
అవి తెగిపడితే మేమూ నేలకొరిగాము..!
కనుమ రోజు కర్ణుడి నాన్నకు దణ్ణమెట్టి..
ఈదిలోని ఆలమందకు బొట్లెట్టినారు.. !
ఈదిలోని చెత్తారగించమని వదిలేసె యజమాని..
ఈనాడైనా గడ్డి పెడతాడో లేదో.. అనుమానమే!
పట్నం లో కోడి పందాలు లేవు గానీ ,
వాటి కండకైతే మటుకు గిరాకి ఉంది మెండుగా!
ఇలా అంతస్తుబట్టీ ఆర్భాటాలు కనిపిస్తున్నాయి!
ఆలోచిస్తే మెక్కేజనమంతా ..పండగ జరుపుకుంటున్నారు!
ఎటొచ్చీ ధాన్యపు గింజకు మద్దతుధరకై ..
రైతు రోడ్డెక్కి రోదిస్తున్నాడు!!