ఆదిమం నుండి ఆధునికత వరకూ..
భిన్నత్వాల బంధుత్వం మనది!
వైరుధ్యాల వైవిథ్యాల వైభవం మనది!!
ధర్మాధర్మాల బ్రాహ్మనిజమూ మనదే!
భౌతికతే నిజమనే చార్వాక తత్వమూ మనదే!!
ప్రతీదీ ప్రశ్నించమనే బౌద్ధపు తర్కమూ మనదే!!
అమ్మోరుకు బలిచ్చే ఆటవికము మనదే!
జీవహింస త్యజించే జైన ఆగమము మనదే!!
క్రైస్తవ స్త్రోత్రములు మనవే!
సూఫీ కవ్వాలీలు మనవే!!
గుర్బని సంగీతాలు మనవే!
పార్శీల దాతృత్వం మనదే!!
ఇరవైరెండు షెడ్యూలు భాషలు మనవే!
ఆపై వేలకొలది ఉపభాషలు మాండలికాలు మనవే!!
మొట్టమొదటి నగరసమాజం హరప్పా మనదే!
చిట్టచివరి సెంథిలీస్ ఆదిమ సమూహము మనదే!!
కశ్మీరపు మంచుకొండలు మనవే!
అండమాన్ అగ్నిపర్వతం మనదే!!
రాజస్థాని ఇసుక ఎడారులు మనవే!
నిత్య వర్షపు దుక్కటి ఈశాన్య అడవులు మనవే!
మధ్య దేశపు ఖనిజ గనులు మనవే!!
డక్కనీ నవాబుల వైభవం మనదే!
విజయనగర దిగ్గజాల ప్రభల అనుభవం మనదే!!
చంద్రగుప్తుడు అశోకుడు
చోళుడు పాలుడు
హాలుడు నన్నెచోడుడు
రుద్రమదేవి రజియసుల్తానా
అక్బరు శివాజి
టిప్పుసుల్తానూ లక్ష్మీబాయి
పాలించే ప్రభువులు
పూజించే విభువులు
సాథక బాథకాల సామాన్యులు
అణగారిన అనుజులు
అందరూ మనవాళ్ళే!!
హెచ్చుతగ్గులు ఉండచ్చు గాని..ఆదాయాలు సంప్రదాయలలో..
అయినా అంతా మనలోని కణములే!!
ఇన్ని వైవిథ్యాల మేళవింపే..మన భారతీయతకు ఇంపు!
ఏకరూపతకై ఆరాటమే.. మనగుంపు మనుగడకు ముంపు!!
ఈ చరిత్ర ఈ భౌగోళికత ఈ పరంపర నేర్పే పాఠం ఒకటే!
నిరంతర మార్పు మాత్రమే నిత్యం..మార్పు అన్నదే సత్యం!!
ఈ మార్పులను స్వాగతిస్తూ ముందుకు పోతామో
లేక ఘోషిస్తూ గతంలో సమాధి అవుతామో
ఆలోచనలు, ఆచరణలు,ఆపై పర్యవసానాలు మనవే!!